0, 28 November, 2021

వాడీవేడిగా జరగనున్న పార్లమెంటు సమావేశాలు: కొత్త వ్యవసాయ చట్టాలు వెనక్కి, మరో 26 బిల్లులు

India

oi-Rajashekhar Garrepally

|

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలు కూడా వాడివేడిగా సాగనున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబర్ 29) నుంచి డిసెంబరు 23 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేకుండానే జరిగింది.

ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజైన సోమవారం నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ప్రతిపక్షాలు, అధికార బీజేపీకి అనుకూలమైన పార్టీలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధమైన మద్దతును కోరాయి. ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర చర్యలు చేపట్టింది.

 Winter parliament Session Likely With 26 Bills on Agenda, Opposition Eyeing MSP

శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును త్వరగా ఆమోదించాలంటూ పలు పార్టీలు తమ డిమాండ్లను లేవనెత్తాయి. రాజ్య సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో పాల్గొని, ఏదైనా సమాచారాన్ని తమతో పంచుకుంటారని తాము భావించామని చెప్పారు. మూడు సాగు చట్టాల రద్దు గురించి మరిన్ని వివరాలు అడగాలని తాము అనుకున్నామన్నారు. ఈ చట్టాలను వేరొక రూపంలో మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉందనే భయాందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పెట్రోలు ధరల పెరుగుదల, చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను ప్రస్తావించింది. మరోవైపు, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం చట్టబద్ధ తీర్మానాన్ని తేవడం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వైసీపీ కోరింది.

ప్రధాని సమావేశంలో లేరనే అంశాన్ని లెఫ్ట్ పార్టీలు లేవనెత్తగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభదాయకమైన ప్రభుత్వ రంగ కంపెనీలను డిజిన్వెస్ట్ చేయవద్దని ప్రభుత్వాన్ని కోరాయి. సభ్యులు ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా సభ సజావుగా జరిగేలా చూడాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్టీ నేతలను కోరారు. స్టాండింగ్ కమిటీలో బిల్లులు చర్చకు రావడం లేదని పలువురు ఫ్లోర్ లీడర్లు సూచించడంతో, సవివరమైన చర్చ కోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ తెలిపారు. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. ఈ సమావేశంలో 31 పార్టీల నేతలు పాల్గొన్నట్లు తెలిపారు. అఖిల పక్ష సమావేశానికి ప్రధాన మంత్రి హాజరయ్యే సంప్రదాయం లేదన్నారు. ఈ సంప్రదాయాన్ని నరేంద్ర మోడీయే ప్రారంభించారన్నారు. ఆదివారం జరిగిన సమావేశానికి మోడీ హాజరుకాలేకపోయారని తెలిపారు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్ ఖర్గే రైతుల సమస్యలపై సవివరమైన చర్చ అవసరమని సూచించారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్, వ్యవసాయ బిల్లులపై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను వర్షాకాల సెషన్‌లో "సంబంధం లేనివి" అని పేర్కొంటూ ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన అన్నారు . పెగాసస్‌లో, వివరాలను పంచుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు.

Private Cryptocurrencies In India క్రిప్టో కరెన్సీ.. తెలుసుకోవాల్సిందే..!! || Oneindia Telugu

కాగా, నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుున సోమవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు ఈ సమావేశాల్లో 26 బిల్లులు సభ ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కీలక బిల్లులు సభముందుకు వస్తోన్న తరుణంలో సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ వారి సభ్యులకు ఇప్పటికే విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.

English summary

Winter parliament Session Likely With 26 Bills on Agenda, Opposition Eyeing MSP.

Story first published: Sunday, November 28, 2021, 23:19 [IST]

Adblock test (Why?)