0, 25 September, 2021

రైతుల భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: నల్ల చట్టాలంటూ మోడీపై ఫైర్

India

oi-Rajashekhar Garrepally

|

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సెప్టెంబర్ 27న చేపట్టనున్న భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు సెప్టెంబర్ 27న జరిగే రైతుల శాంతియుత భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

గత 9 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు గౌరవ్ వల్లభ్ తెలిపారు. కేంద్రం రైతులతో చర్చలు జరపాలని అన్నారు.

 Congress Supports Bharat Bandh Call By Farmer Unions on 27th Sept

కనీస మద్దతు ధర ప్రతి ఒక్క రైతు న్యాయబద్ధమైన హక్కు అని కాంగ్రెస్ పార్టీ నేత పేర్కొన్నారు. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. అయితే, రైతులు ఆ మాటలను నమ్మరని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కంటే ఎన్డీఏ హయాంలో రైతుల ఆదాయం భారీగా తగ్గిందని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రైతుల ఒక రోజు ఆదాయం రూ. 27గా ఉందన్నారు. గత ఏడేళ్లుగా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందన్నారు.

కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ నుంిచ ఈ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ చట్టాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

సాగు చట్టాలపై రైతులకు ఉన్న అభ్యంతరాలను, ఇతర వర్గాల అభిప్రాయాలపై సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికపై త్రిసభ్య కమిటీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందజేసింది. అయితే, కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా రైతు నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని చెప్పింది. అయితే, రైతులకు ఎంతో మేలు చేసే వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తోంది.

ఇంతకుముందు బైడెన్‌కు టికాయట్ వినతి

ఇది ఇలావుండగా, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) రాకేష్ టికాయత్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం జరిగే సమావేశంలో వీటిపై ప్రస్తావించాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం భేటీ కానున్న నేపథ్యంలో కొన్ని గంటల ముందు టికాయత్ ఈ మేరకు ట్వీట్ చేశారు. డియర్ పోటస్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతులం ఆందోళన చేస్తున్నాం. గడిచిన 11 నెలలుగా జరుగుతోన్న ఈ నిరసన కార్యక్రమాల్లో ఇప్పటి వరకు దాదాపు 700 మందికి రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మమ్మల్ని రక్షించడానికి ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం సందర్భంగా మా ఆందోళనను పరిగణలోకి తీసుకోండి అంటూ రాకష్ టికాయత్ ట్విట్టర్ వేదికగా కోరారు. మూడు రోజులప పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు చేరుకున్నారు. కరోనావైరస్, ఆప్ఘాన్ లో తాలిబన్ల పాలన, ఇతర అంశాలపై దేశాధినేతలతో చర్చించిన విషయం తెలిసిందే.

English summary

Congress Supports Bharat Bandh Call By Farmer Unions on 27th Sept.

Story first published: Saturday, September 25, 2021, 22:46 [IST]

Adblock test (Why?)