0, 12 February, 2019

విమానాశ్రయంలో మాజీ సీఎంను అడ్డుకున్న పోలీసులు: భుజంపై చెయ్యి వేసి మరీ పక్కకు..: రచ్చ, రచ్చ

National

oi-Chandrasekhar Rao

|

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు ఘోర అవమానం ఎదురైంది. రాజధాని లక్నో విమానాశ్రయంలోనికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయన భుజంపై చెయ్యి వేసి మరీ.. పక్కుకు తీసుకెళ్లారు. మంగళవారం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. విమానం ఎక్కకుండా పోలీసులు అడ్డుకున్న దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సమాజ్ వాది పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి అఖిలేష్ యాదవ్ వెళ్లాల్సి ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఇనుప బ్యారికేడ్లను అడ్డుగా పెట్టిన పోలీసులు.. అఖిలేష్ ను లోనికి వెళ్లనివ్వలేదు. బలవంతగా లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అఖిలేష్ ను అక్కడి పోలీసులు భుజంపై చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్లారు.

Akhilesh Yadav Says Detained While Trying To Board Plane

దీనికి ఆగ్రహానికి గురైన ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చెయ్యి వెయ్యొద్దు.. అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. విమానం ఎక్కనివ్వకూడదంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు ఆయనకు తెలిపారు. ఈ గందరగోళం మధ్యే అఖిలేష్ యాదవ్.. రన్ వే పై ఉన్న తేలికపాటి విమానం వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అదే రీతిలో ప్రవర్తించారు. విమానంలోనికి వెళ్లకుండా.. మెట్లపై అడ్డుగా నిల్చున్నారు. అక్కడ కూడా ఆయన పోలీసులతో గొడవ పడ్డారు.

యోగి ప్రభుత్వం అనుసరిస్తోన్న దౌర్జన్యానికి ఇది నిదర్శనమని అంటూ అఖిలేష్ యాదవ్ విమానాశ్రయంలోనే ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల ప్రమాణ స్వీకారాన్ని చూసి, ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందని నెలరోజుల కిందటే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చానని అన్నారు. తనను అడ్డుకోవడానికి యోగి ప్రభుత్వం.. తెల్లవారు జామునే పోలీసులను తన ఇంటికి పంపించిందని చెప్పారు.

ప్రయాగ్ రాజ్ లో అర్ధకుంభమేళా కొనసాగుతున్నందున.. అఖిలేష్ యాదవ్ అక్కడికి వెళ్తే, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. ప్రయాగ్ రాజ్ లో పరిస్థితి అదుపు తప్పితే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అఖిలేష్ యాదవ్ ను అడ్డుకుంటున్నామని అంటున్నారు. విద్యార్థి సంఘాల ప్రమాణ స్వీకారానికి రాజకీయ నాయకులు రాకూడదని అలహాబాద్ యూనివర్శిటీ అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించారు. యూనివర్శిటీ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలనే ఆయన కూడా లేవనెత్తారు. విద్యార్థి సంఘాలు ప్రమాణ స్వీకారం చేస్తోంట.. దానికి రాజకీయ నాయకులు హాజరు కావాల్సిన అవసరం ఏముందని యోగి అన్నారు. ప్రయాగ్ రాజ్ లో అర్ధకుంభమేళా కొనసాగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కాగా, అఖిలేష్ ను పోలీసులు విమానాశ్రయంలో అడ్డుకున్నారనే వార్త ఉత్తర్ ప్రదేశ్ లో దావానలంలా వ్యాపించింది. రాజధాని లక్నో సహా ప్రయాగ్ రాజ్ లో సమాజ్ వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. బైఠాయించారు. పలు చోట్ల వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. లక్నో, ప్రయాగ్ రాజ్ లల్లో పోలీసులు, ఎస్పీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అఖిలేష్ యాదవ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని బహుజన్ సమాజ్ వాది పార్టీ ఖండించింది. దీన్ని దురదృష్టకరమైన ఘటనగా మాయావతి అభివర్ణించారు.

యోగి పగ తీర్చుకున్నారా?

అఖిలేష్ యాదవ్ ను అడ్డుకోవడం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పగ తీర్చుకున్నారనే వాదన వినిపిస్తోంది. 2015లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఇదే అలహాబాద్ యూనివర్శిటీలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. అప్పటి గోరఖ్ పూర్ లోక్ సభ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి బయలుదేరగా.. సమాజ్ వాది పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. ఆ ఘటనకు ప్రతీకారంగా యోగి.. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ను అడ్డుకున్నారని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Let's block ads! (Why?)