0, 23 April, 2021

ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

కోవిడ్ రోగికి ఆక్సిజన్‌

దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

ఆక్సిజన్ కోసం ఎదురుచూసి సకాలంలో అందక ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని ఐసీయూ బెడ్‌లు 99 శాతం నిండిపోయాయి.

ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎదుర్కొంటున్న భారత్‌లో గురువారం ప్రపంచంలో ఇంకే దేశంలోనూ నమోదు కానంత స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

ఇప్పటివరకు దేశంలో సుమారు 1.6 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గురువారం ఒక్క రోజే 3,14,835 కేసులు కొత్తగా నిర్ధరణ కావడంతో పాటు 2,104 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆక్సిజన్‌ను పంపించకుండా ఆపేశాయని వార్తాచానల్ ఎన్డీటీవీ తన కథనంలో తెలిపింది.

తాను కోవిడ్ చికిత్స పొందుతున్న దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు మరో మూడు గంటలకు మించి సరిపోవని.. ఎలాగైనా కాపాడాలని కోరుతూ సౌరబ్ భరద్వాజ్ అనే రాజకీయ నాయకుడు ట్వీట్ చేశారు.

''ఎంతోమంది కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించడం వల్లే బతుకుతున్నారు. సకాలంలో ఆక్సిజన్ కనుక సరఫరా చేయలేకపోతే వారంతా ఒడ్డున పడ్డ చేపల్లా చనిపోతారు'' అని ఆయన ట్వీట్ చేశారు.

''దేశంలోనే అత్యుత్తమ ఆరోగ్య సేవల వ్యవస్థ ఉన్న దిల్లీ ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల వల్ల సతమతమవుతోంది'' అని బీబీసీ ఇండియా కరస్పాండెంట్ యోగితా లిమాయే అన్నారు.

శవాల అంత్యక్రియల కోసం కూడా మృతుల కుటుంబీకులు స్మశానాల వద్ద గంటల కొద్దీ సమయం వేచి చూడాల్సి వస్తోంది.

దిల్లీలోని అనేక స్మశానాల్లో రాత్రీపగలు తేడాలేకుండా సామూహిక దహనాలు చేస్తున్నారు.

''గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా రోజుకు సగటున 8 నుంచి 10 మృతదేహాలు వచ్చేవి. ఒక రోజు మాత్రం 18 శవాలను తెచ్చారు. కానీ, ఈసారి అలా కాదు.. నిన్న ఒక్క రోజు రాత్రే 78 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాం'' అని ఈశాన్య దిల్లీలోని ఓ స్మశానంలో అంత్యక్రియలు చేసే జితేందర్ సింగ్ 'రాయిటర్స్' వార్తాసంస్థతో చెప్పారు.

'ఇంకా చాలా మృతదేహాలు స్మశానం బయట అంత్యక్రియల కోసం ఉన్నాయి. వాటిని దహనం చేయడానికి స్మశానంలో స్థలమే లేదు'' అన్నారాయన.

దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడు(పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. రోగులు డాక్టర్లను కొట్టడానికి వస్తున్నారు. ప్రతిదానికీ వైద్యులనే నిందిస్తున్నారు. ఆసుపత్రుల నిర్వాహకులు కూడా వైద్యులనే నిందిస్తున్నాయి. చాలా ఒత్తిడి మధ్య పనిచేయాల్సి వస్తోంది'' అన్నారు.

''మాకున్న ఆక్సిజన్ వసతిలో 99 శాతం ఇప్పటికే ఉపయోగించేశాం.. ఒక శాతం మాత్రమే ఉంది.. ఇది చాలా దయనీయమైన పరిస్థితి'' అన్నారు ఆ డాక్టర్.

దిల్లీలో పరిస్థితి

దిల్లీలో నివసించే తన 90 ఏళ్ల తల్లి హరివంశ్ కౌర్ కోవిడ్ బారినపడి బుధవారం మరణించారని యూకేలోని లీస్టర్ నివాసి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు.

దిల్లీలో ఉన్న ఆయన కుటుంబసభ్యులలో ఏడుగురికి కరోనా సోకగా తల్లి చనిపోయారు.

ఎవరో ఒకరు సహాయంగా లేకపోతే చేర్చుకోబోయని స్థానిక నర్సింగ్ హోం చెప్పడంతో హరివంశ్ కౌర్ ఇంటివద్దే మందులు వేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. మిగతా కుటుంబసభ్యులంతా కూడా కోవిడ్ బారిన పడడంతో నర్సింగ్ హోంలో ఆమెతో ఎవరూ ఉండడానికి వీలుకాక ఇంట్లోనే చికిత్స పొందారు. పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు.

''లీస్టర్ నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ చేసి.. ఎంతో వేడుకుంటే ఎలాగోలా మా అమ్మ అంత్యక్రియలు పూర్తి చేయించగలిగాను. చివరకు ఓ దాతృత్వ సంస్థ ఆమెకు అంత్యక్రియలు చేసింది. ఆమెకు మా కుటుంబం సరిగా తుది వీడ్యోలు పలకలేకపోయాం. ఆమె మరణం, తరువాత పరిస్థితులు మానసికంగా నన్ను చాలా బాధ పెట్టాయి'' అన్నారు సుఖ్వీందర్.

సుఖ్వీందర్ తనకున్న పరిచయాలను ఉపయోగించి సోదరుడు, వదినలను ఎలాగోలా ఒక ఆసుపత్రిలో చేర్పించారు. వారికి అవసరమైన మందులు, ఆక్సిజన్ కూడా ఆయన సంపాదించారు. బ్లాక్ మార్కెట్‌లో ధరలు పెరగడం వల్ల మందులు కొనడం కూడా చాలా కష్టమైంది అన్నారాయన.

''మాది దిగువ మధ్య తరగతి కుటుంబం.. పెద్దపెద్ద ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోవడం కష్టం. ఇక రోజుకూలీపై బతికే పేదల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు'' అన్నారాయన.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు

పరిస్థితులు ఇంత దారుణంగా మారాయెందుకు?

ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అదుపులోనే ఉంది. కానీ, ఆ తరువాత అనేక కారణాల వల్ల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి.

గత నెల రోజులుగా దేశంలో కేసులు పెరిగాయి. ప్రజల్లో చాలామంది కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం, డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ సహా వివిధ కరోనా వేరియంట్లు వ్యాపించడం, లక్షల మంది హాజరైన ఉత్సవాలు కారణంగా వైరస్ వ్యాప్తి తీవ్రమైంది.

ప్రధాని మోదీ సహా రాజకీయ నాయకులు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలూ వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయన్న విమర్శలున్నాయి.

ఎన్నికలు కొనసాగించడాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటోంది.. అయితే, ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించరాదని ఎలక్షన్ కమిషన్ తాజాగా ఆదేశించింది.

ఏం చర్యలు తీసుకున్నారు?

ఆక్సిజన్ కొరత, సరఫరాలో సమస్యలపై ప్రధాని మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

రాష్ట్రాల అవసరాలను గుర్తించి తదనుగుణంగా సరఫరా చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఒకటి వెల్లడించింది.

దేశవ్యాప్తంగా సత్వర సరఫరా కోసం వాయు, రైలు మార్గాలనూ ఉపయోగించుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ వంటిదేమీ లేదు. అయితే, రాష్ట్రాలు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నాయి.

దిల్లీ ప్రభుత్వం వారం రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది.

మహారాష్ట్రలోనూ కట్టుదిట్టమైన ఆంక్షలు ప్రకటించారు.

వ్యాక్సినేషన్ సంగతేంటి?

ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ టీకా కొరత వంటి ఇబ్బందుల మధ్య కొనసాగుతోంది.

ఇప్పటివరకు 13 కోట్లకు పైగా డోసుల టీకా వేశారు. జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సీన్ వేయాలన్న లక్ష్యాన్ని భారత్ చేరుకోలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ వేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ టీకా కొరత నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Adblock test (Why?)