0, 4 May, 2021

కోవిడ్: సేవా గుణమే వీళ్ల ఇమ్యూనిటీ.. కరోనాకు భయపడకుండా బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

తిరుపతి కోవిడ్-19 జేఏసీ స్వచ్ఛంద సంస్థ సేవలు

కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు.

మందులు, ఆహారం, ఆసుపత్రి అవసరాలు, అంత్యక్రియలు ఇలా దేనికీ, ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోయినా, మేమున్నామంటూ తెలుగు రాష్ట్రాలలోని పలు స్వచ్ఛంధ సంస్థలు కరోనా రోగులకు, మృతులకు సేవలు అందిస్తున్నాయి.

కరోనా బాధితులు బయటకెళ్లి మందులు, నిత్యావసరాలు తెచ్చుకోవడం, అవసరమైనప్పుడు ఆసుపత్రికి వెళ్లడం చాలా కష్టమైన పని.

అలాగే కరోనా రోగులకు, ముందుకొచ్చి సాయం చేసేవారు కనపడరు. ఎవరినైనా సాయం అడిగినా చేయరు. అది వారి తప్పుకాకపోయినా, ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి.

అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. అంటే, మందులు అందించడం దగ్గర నుంచి, మృతుల అంత్యక్రియల వరకూ అన్ని పనులూ చేసే వలంటరీ అర్గనైజేషన్లు ఇప్పుడు చాలా మందికి అండగా నిలుస్తున్నాయి.

ఈ స్వచ్ఛంద సంస్థల్లో ఎక్కువగా యువతే పనిచేస్తున్నారు. వీళ్లంతా చదువు, వ్యాపారాలు, ఉద్యోగాలు కొనసాగిస్తూనే కరోనా కష్టకాలంలో మీకు మేమున్నామంటూ ఎంతోమందికి భరోసా ఇస్తున్నారు.

మతం కంటే మానవత్వం గొప్పది

'సర్...నా పేరు భార్గవి...ఇవాళ హాస్పిటల్ లో మా నాన్నగారు కోవిడ్ తో చనిపోయారు. మా బంధువులు, హాస్పిటల్ సిబ్బంది ఎవరూ మృత దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లడానికి రావడం లేదు. మాకేమైనా సహాయం చేయగలరా...? ప్లీజ్...ప్లీజ్..." అంటూ తిరుపతిలోని యునైటెడ్ ముస్లిం అసోసియేషన్, కోవిడ్-19 జేఏసీకు ఫోన్ వచ్చింది.

ఆ అసోసియేషన్ సభ్యులు వెంటనే వచ్చి ఆ శవాన్ని అంబులెన్స్ లో శ్మశానానికి తీసుకెళ్లి మృతుడి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు చేశారు

తిరుపతిలో చాలా ఏళ్లుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే కరోనా తర్వాత, తమను సాయం అడిగే వారి సంఖ్య పెరిగిందని కోవిడ్-19 జేఏసీ అధ్యక్షుడు షేక్ ఇమామ్ సాహెబ్ బీబీసీకి చెప్పారు.

"మేం మొదట ముస్లిం కుటుంబాల్లో కోవిడ్ బాధితుల కోసం కోవిడ్-19 జేఏసీ ఏర్పాటు చేశాం. హాస్పిటల్స్ దగ్గరకు వెళ్లినప్పుడు అన్నీ మతాల వాళ్లూ బాధలు పడుతున్నారనే విషయం గమనించాం. దాంతో, మతం కంటే, మానవత్వమే ముఖ్యమని. అందరికీ సాయం చేయడం ప్రారంభించాం. సొంతంగా అంబులెన్స్ కొన్నాం. కోవిడ్ రోగులు చనిపోతే, అంబులెన్సులో మృతదేహాన్ని ఉచితంగా తరలించడంతోపాటూ, వారి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నాం" అన్నారు.

"మాలో మేమే డబ్బులు వేసుకుంటాం. ఎవరినీ అడగం. అయితే, కొందరు మాకు కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు. బాధితులు కూడా కొందరు డబ్బులిస్తారు. ఆ డబ్బును మేం తిరిగి పేదవారికే ఖర్చుచేస్తాం. తిరుపతిలో ఎక్కడికైనా ఉచితంగా డెడ్ బాడీని తరలించి అంత్యక్రియలు చేస్తాం. ఇంకా దూరం వెళ్లాల్సి వస్తే మాత్రం అంబులెన్స్ డీజిల్ ఖర్చులు ఇస్తే చాలు. మా టీంలో మొత్తం 25 మంది ఉన్నాం. నాలుగు బృందాలుగా విడిపోయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పటి వరకూ 460 కరోనా మృతులకు అంత్యక్రియలు చేశాం. అయినా మాకెవరికీ కరోనా రాలేదు. అది బాధితుల దీవెనలే వల్లే అనుకుంటున్నాం " అన్నారు షేక్ ఇమామ్ సాహెబ్.

వీడియో కాల్ చేసి చూపిస్తాం

మోహన్, ప్రసాద్, రఫీ శ్రీకాకుళంలో సాయిగిరి యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా మంది తమ సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా లక్షణాలున్న వారికి, హోం క్వారంటైన్‌లో వారికి మందులు, ఆహారం అందడం కష్టంగా ఉందని వారు చెప్పారు.

ఎవరికైనా సీరియస్‌గా ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్సులు, కనీసం ఆటోలు కూడా రావడం లేదని, దాంతో మా స్నేహితులంతా కలిసి కోవిడ్ బాధితులకు సేవలు అందించాలని నిర్ణయించుకున్నామని సాయిగిరి యూత్ అసోసియేషన్ సభ్యులు బీబీసీతో చెప్పారు.

"మా అసోసియేషన్ లో శ్రీకాకుళంలో ఉంటున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కొందరు వార్డు వాలంటీర్లు కూడా ఉన్నారు. మేం కోవిడ్‌ ఆసుపత్రులు, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండే కరోనా బాధితులకు సేవ చేస్తున్నాం. మా సంఘంలో సభ్యులెవరికైనా ఫోన్ లేదా వాట్సప్ మేసేజ్ చేస్తే చాలు వారికి కావలసిన మందులు, ఆహారం, ఇతర వస్తువులు ఏవైనా అందిస్తాం. ఎలాంటి ఛార్జీలు తీసుకోం. వస్తువులకి వారు డబ్బులిస్తారు. కొందరు పేదలైతే ఇవ్వలేరు. మేం అడగం కూడా. ఎందుకంటే మా సేవలు మెచ్చి మాకు సాయం చేసేవారు కొందరున్నారు".

"సొంతవారైనా కొందరు కోవిడ్ బాధితులకు దూరంగా ఉంటారు. అలాంటి వారు మాకు ఫోన్ చేసి మా వాళ్లు ఫలానా ఆసుపత్రిలో ఉన్నారు. వీడియో కాల్‌లో చూపించండి అని అడుగుతుంటారు. వాళ్లతో మాట్లాడిస్తాం. అలాగే మా సొంత ఖర్చులతో భోజనాలు ఏర్పాటు చేస్తాం. మాకు రోజు సాయం కోరుతూ కనీసం 50 కాల్స్ వస్తుంటాయి" అని సాయిగిరి యూత్ సభ్యులు చెప్పారు.

పిల్లలకు పుస్తకాలు అందిస్తాం...

'డాడీ హెల్పింగ్ ఫౌండేషన్' కోవిడ్ రోగులకు సేవలు అందించడంతోపాటూ ప్రస్తుతం స్కూళ్లు మూసి ఉండడంతో పిల్లలకు పుస్తకాలు కూడా అందిస్తోంది. ఫోన్ చేసి కావల్సిన పుస్తకాలు చెబితే వారికి తీసుకొచ్చి ఇస్తోంది.

"డాడీ హెల్పింగ్‌ ఫౌండేషన్‌ శ్రీకాకుళం నగర పరిధిలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి నిత్యావసరాలు, మందులు, ఆహారంతో పాటు అవసరమైన వారికి అంబులెన్సు కూడా ఏర్పాటు చేస్తోంది. అలాగే పీపీఈ కిట్లు వేసుకుని కరోనా మృతులకు అంత్యక్రియలు చేస్తున్నాం. మా సొంత డబ్బుతోనే చాలా వరకు చేస్తాం. మమ్మల్ని చూసి బాధితులకు ధైర్యం వస్తోంది. అది మాకు ఎంతో తృప్తినిస్తోంది" అని ఫౌండేషన్‌ సభ్యుడు ప్రభాస్ సూర్య బీబీసీతో చెప్పారు.

ఉచిత క్వారంటైన్ సెంటర్లు...

కరోనా పాజిటివ్ వచ్చినా, కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనిపించినా ముందుగా సెల్ప్ క్వారైంటెన్ లోకి వెళ్లాలి. అయితే చిన్నచిన్న ఇళ్లలో ఉంటున్నవారు క్వారంటైన్ కోసం ప్రత్యేకంగా గదులు కేటాయించుకోలేరు. అంతా కలిసే ఉంటారు.

అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మిగతా వారికి కరోనా సోకే అవకాశం ఉంది. అందుకే, కొన్ని స్వచ్ఛంధ సంస్థలు కోవిడ్ బాధితుల కోసం ఉచిత క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి.

తెలంగాణా మల్కాజిగిరి జిల్లాలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే రాష్ట్రీయ విద్యా కేంద్రంను నిర్వాహకులు కోవిడ్ సెంటరుగా మార్చేశారు.

"అన్నోజీగూడలోని సేవాభారతి ఆధ్వర్యంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అందులో 200 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని మాత్రమే తీసుకుంటాం. అది కూడా స్వల్పకోవిడ్ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే చేర్చుకుంటాం. ఇక్కడ చేరిన రోగులకు కావాల్సిన మందులు, ఆహారం అందిస్తున్నాం. మా టోల్ ఫ్రీ నెంబరు 24 గంటలూ పని చేస్తుంది. ఈ సెంటరును త్వరలోనే 500 పడకలకు పెంచుతాం" అని సేవా భారతి ప్రతినిధి చంద్రశేఖర్ బీబీసీకి చెప్పారు.

ఈ కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆహారం అందించడంతోపాటూ రోగులతో యోగా, వ్యాయామం కూడా చేయిస్తున్నారు. నిరంతరం డాక్టర్లను అందుబాటులో ఉంచారు.

'అందరు మనవాళ్లే'

కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి ప్లాస్మా ప్రాణం పోస్తోంది. అందుకే ప్రస్తుతం ప్లాస్మా దాతలను దేవుళ్లతో సమానంగా చూస్తున్నారు.

సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో రక్తదానం చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. చాలా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సైతం తగ్గుతున్నాయి.

దీంతో, కరోనా కష్ట కాలంలో హైదరాబాద్‌లోని 'అందరూ మనవాళ్లే' అనే స్వచ్ఛంద సంస్థ రక్తం, ప్లాస్మా సేవలు అందించడానికి ముందుకొచ్చింది.

తమ సంస్థలో భాగమైన 'బ్లడ్ ఆర్మీ' ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులలో కూడా వేలాది మందికి రక్తదానం చేశామని ఈ సంస్థను నడిపే అక్కు జైన్ బీబీసీకి చెప్పారు.

"'అందరూ మనవాళ్లే' పౌండేషన్ ఎల్బీనగర్‌లో ఉంది. ప్లాస్మా, బ్లడ్ మాత్రమే కాకుండా బాంబే బ్లడ్ గ్రూపు లాంటి అరుదైన గ్రూపు రక్త దాతలను కూడా మేం ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోటుకి మేమే స్వయంగా వెళ్లి ఆ రక్తం అందిస్తాం. రక్తదాతలు మా ఆర్మీలో ఉన్నారు కాబట్టి, కోవిడ్ పేపెంట్లకు ఎవరికైనా ప్లాస్మా అవసరమైతే, మాకు తెలిసిన, లేదా మా ఆర్మీలో కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఎవరైనా ఉంటే వారి ప్లాస్మా అందే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు మా బ్లడ్‌ ఆర్మీ వేలమందికి రక్తం అందించింది. అలాగే పేదలకు ఆకలి తీర్చడం, అసవరమైన నిత్యవసరాలు అందించడం కూడా చేస్తుంటాం" అని ఆయన తెలిపారు.

"మా బ్లడ్ ఆర్మీలో అంతా యూత్ ఉన్నారు. క్షణం అలస్యం చేయకుండా అందరూ ముందుకొస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నాం, ఎంతమందికి సాయం చేశామనే లెక్కలు వేసుకోలేదు. నా దగ్గరే దాదాపు 10 వేల మంది రక్తదాతల కాంటాక్ట్స్ ఉన్నాయి. మేం 24 గంటలూ అందుబాటులో ఉంటాం. మా గ్రూపులో మొత్తం 15 మంది వర్కింగ్ మెంబర్లు, బ్లడ్ ఆర్మీలో 10 వేల మంది సభ్యులు ఉన్నారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినపుడు మేమంతా కలిసి పని చేస్తాం" అన్నారు అక్కు జైన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Adblock test (Why?)